స్నేహితుడి గెలుపు కోసం.. తమిళనాట జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రచారం.. ఎవరీ మునిరత్నం?

  • తమిళనాడు ఎన్నికల ప్రచారంలో జేసీ ప్రభాకర్ రెడ్డి
  • మిత్రుడు, కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్నం కోసం ప్రచారం
  • జేసీ, మునిరత్నం గతంలో ట్రావెల్స్ వ్యాపార భాగస్వాములు
తమిళనాడులో ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తమిళ రాజకీయాల్లో ప్రత్యక్షమయ్యారు. తన చిరకాల మిత్రుడు, శోలింగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఏఎం మునిరత్నం తరఫున ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. స్నేహితుడి గెలుపు కోసం తనవంతు ప్రయత్నం చేస్తూ, ఎన్నికల ప్రచార సభలను పర్యవేక్షించారు.

జేసీ ప్రభాకర్ రెడ్డికి, మునిరత్నంకు మధ్య చాలా కాలంగా స్నేహం ఉంది. వీరిద్దరూ గతంలో ట్రావెల్స్ వ్యాపారంలో భాగస్వాములుగా కూడా ఉన్నారు. ఈ స్నేహంతోనే శోలింగర్ వెళ్లిన జేసీ, మునిరత్నం ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులతో కూడా సమావేశమై ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఎవరీ మునిరత్నం?
ఏఎం మునిరత్నం కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన 1989, 1991, 1996, 2021 ఎన్నికల్లో శోలింగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మధ్యలో కొన్నిసార్లు ఓటమి చవిచూసినా, నియోజకవర్గంలో బలమైన నేతగా పేరుంది. ప్రస్తుతం మరోసారి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచారు. ప్రచారానికి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో మిత్రుడి గెలుపు కోసం జేసీ తన వంతు సహకారం అందిస్తున్నారు. తమిళనాడులో ఈ నెల‌ 23న పోలింగ్ జరగనుంది.

JC Prabhakar Reddy
Munirathinam
Sholingur Constituency
Tamil Nadu

More Telugu News